తిరుమలలో
రాయిగా నువ్వు..
పరాయిగా మేము..!
తిరుపతి వెళ్లాలంటే భయమేస్తోంది..
మీరు చదివింది కరెక్టే..
కలియుగ వైకుంఠంగా
మనందరం భావించే తిరుమల వెళ్ళాలంటే
మునుపటి కాలంలో
అదో వైభోగం..
ఒరేయ్..తిరుపతి వెళ్తున్నామని ఇంట్లో పెద్దవాళ్లు చెప్పినప్పటి నుంచి చెప్పలేనంత ద్రిల్లు..
మనసు ఆనందాల హరివిల్లు..!
ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతులేని ఉత్సాహంతో ఎదురుచూపులు.ఈలోగా నాన్నగారు యాత్రకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేవారు.
ఎవరి స్థాయిలో వారు.సాధారణంగా రైలు ప్రయాణమే.కొంచెం అవకాశం ఉన్నోళ్లు కారు.సామాన్య జనమైతే యాత్రా స్పెషల్ బస్సులు..మొత్తానికి ఏదోలా తిరుపతి చేరడమే ప్రధానం.
ప్రయాణంలో చెప్పనలవి కాని ఉత్కంఠ.చేరే వరకు తొందరే.తిరుపతి చేరుతున్నామనగానే శ్రీనివాసుని వాసం..తిరుమల గిరులు కనిపించగానే అద్భుతాన్ని చూస్తున్న భావన.ఆ కొండల్లో ఏ మూల..ఊహు..శిఖరంపై…అహ..అణువణువునా వెంకన్న నిండినిభిడీకృతుడై ఉన్నాడు కదా అనే ఆలోచనతో ఉప్పొంగే మనసు.
తిరుపతి స్టేషన్
చేరిన తర్వాత కొండపైకి పయనం.వంకీల రోడ్డు..కాస్త పైకి వెళ్లేపాటికి కింద చిన్నవైపోతున్న ఇళ్లు..
చేతికి తగులుతున్నాయా..
మనసును తాకుతున్నాయా
అన్న హాయి..చక్కని ఆస్వాదన. దిగినాక బస..
గుండు..స్నానాలు..
సంప్రదాయ వస్త్రాలు..
క్యూలో చేరి స్వామి సన్నిధికి అలుపెరుగని గమనం..
నిమిషాలు..గంటలు..
ఇలా ఎంతసేపో..అన్ని మలుపులు తిరిగి మహాద్వారం వద్ద కాళ్ళు తడుస్తుంటే అదోలాంటి పులకింత..ఇంకాస్త ముందుకు వెళ్ళి బంగారు వాకిలి తాకి..మలుపు తిరగ్గానే దూరం నుంచి స్వామి తొలి దర్శనం..
అద్భుతం ఆవిష్కారం అయినట్టే..అక్కడి నుంచి పెరిగే తాపత్రయం..
దాంతో పాటు ఊపందుకునే తోపులాట.చివరకు స్వామి చేరువకు.. లిప్త పాటు మాత్రమే..కాని జన్మజన్మల పుణ్యఫలం..కోరికలు మరచిపోయే అద్వైత అనుభూతి.చుట్టూ ఏం జరుగుతుందో స్పృహే ఉండని అలౌకిక భావన.
ఒక్క క్షణం పాటు వైకుంఠ విహారం.దేవదేవుని కొలువులో ఆధ్యాత్మిక సంచారం.దేహం నుంచి జీవుడు బయల్పడి స్వామి పాదాల చెంతకు చేరిన అద్భుత స్థితి..అంతలో మనం ప్రాంగణం బయట.
అప్పుడే వచ్చేశామా..దర్శనం అయిపోయిందా.. ఎంతో కష్టపడి వస్తే ఇంతసేపేనా దర్శనం..మరోసారి వెళ్ళగలిగితే బాగున్ను..
అందరిలో అదే భావన..తీరని యాతన..
అంతులేని తపన..!
సరే..ఎంత రాసినా తరగని కథ..తిరుపతి యాత్ర అనుభూతి..ఒక్కొకరికి ఒక్కోలా..ఎన్ని ప్రాంతాల మనిషులు..ఎన్ని సంస్కృతులు..అక్కడ వినిపించే ఎన్ని భాషలు.. ఎవరి గోల వారిది..
వచ్చామా..దర్శనం చేసుకున్నామా..ప్రసాదం తిన్నామా..లడ్డూలు వీలైనన్ని కొన్నామా..ఇదే దీక్ష..అదే రక్ష…!
ఇంతకీ ఇదంతా ఎందుకు రాసినట్టు అంటే..అంతటి దివ్యానుభూతుల మాలిక..
అద్భుతాల వేదిక.. జగతిన అత్యున్నత పీఠిక..
ఆ తిరుపతి యాత్ర..
ఇప్పుడు అలా లేదు.
రైలు రిజర్వేషన్ మొదలు..
బస..దర్శనం..అన్నీ క్లిష్టమే.
వసతులు పెరిగాయి.. అంతే స్థాయిలో వెతలూ పెరిగాయి.
నీకు నాకు దేవుడికీ మధ్య ఎన్నో గండాలు..!
ఇప్పుడు తిరుమలలో
ఏం కావాలన్నా
రాజకీయ నాయకులను ఆశ్రయించాల్సిందే.దర్శనం..కాటేజీ..కొంచెం పరపతి ఉంటే ప్రత్యేక దర్శనాలు..సేవలు..
వీటన్నిటికీ ఎవరైనా ఎమ్మెల్యేనో..ఎంపినో పట్టుకోవాల్సిందే..వాళ్లేమైనా వెళ్ళగానే దొరికేవారా..
అడగ్గానే ఉత్తరం ఇచ్చేవారా.
ఎన్ని ప్రదక్షిణలు..ఎన్నెన్ని అవాంతరాలు..ఇవన్నీ కాస్తయినా అవకాశం ఉన్నవారికి..సామాన్యులైతే ప్రజాప్రతినిధి దగ్గరకే చేరలేని పరిస్థితి.ఒకవేళ ఇన్నీ దాటి తిరుమల చేరినా అక్కడ కార్యాలయాల చుట్టూ తిరగడం మరో పెద్ద ప్రయాస.!
ఇక ఆన్లైన్ బుకింగుల గోల.
కోటా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూడ్డం..తీరా విడుదల అయినప్పటికి లాగిన్ అవ్వడం..టికెట్ దొరకడం అన్నీ దుర్లభమే..ఈలోగా
కోటా క్లోజ్..!
పోనీ..దర్శనం టోకెన్ దొరికినా రైల్వే రిజర్వేషన్ సంగతేంటో..కాటేజీ గతి ఏమిటో..అన్నీ గండాలే..
సుడిగుండాలే..!
కొండ పైకి వెళ్ళాలంటే అన్ని రిజర్వేషన్లు ఉండాలి.
లేకపోతే అలిపిరి వద్దనే అడ్డగింపులు.
కొండ మీద వాతావరణం కూడా మారినట్టే అనిపిస్తోంది.కొంత ప్రాధాన్యత తగ్గింది.చిన్నప్పటి నుంచి చూస్తున్న అదే తిరుమల కాదేమో అనే భావన మనసులో ఏదో మూల..
వచ్చామా..దేవుణ్ణి చూసామా..తిరుగు ప్రయాణం కట్టామా..
యాత్ర అంతా యాంత్రికం..!
మామూలు భక్తులు గంటల తరబడి వేచి ఉన్నా లభించని దర్శనం విఐపిలకు క్షణాల్లో..ఒక్కో విఐపి వెనక ఎందరో అనుచరులు..
అందరికీ ప్రత్యేక దర్శనమే..
అదో లీల..!
దివ్యాంగుల కోసం కేటాయించిన ప్రత్యేక దర్శనం కూడా కష్టాల మయమే.దర్శనమైతే తొందరగానే జరుగుతుంది గాని అంతకు ముందు తంతు పెద్దదే.లోపలికి పంపేటప్పుడు మిగిలిన భక్తుల్ని ఆపుతారు.దర్శనం ముగిసేపాటికి అందర్నీ వదిలేయడంతో ఇక బయటికి రావడానికి తొక్కిసలాటే.ఎవరూ ఆగరు.
అందరికీ తొందరే.కొందరు దివ్యాంగులు పడిపోతున్నా పట్టించుకోని పరిస్థితి.
ఇలాంటి కష్టాల నడుమ
ఇప్పుడు కొత్త కష్టాలు..
తిండి దొరుకుతుందో లేదో..
దొరికినా ప్రియం..
ఆ మధ్యన బయటి స్టాల్స్ ఆపేసి అదో గందరగోళం..
ప్రసాదానికీ ఇబ్బందే..ఎప్పటికప్పుడు మారిపోయే నిబంధనలు..
అన్ని చోట్ల ఏదో ఒక రకం సమస్య..ఇప్పుడిప్పుడే పరమత ప్రచారాలు..
ఇతరుల జోక్యాలు..
ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలియని అయోమయం..
ఇప్పుడు పులి బెడద.. కర్రల గోల..ఏమిటయ్యా
నీ లీల..!?
మొత్తానికి తిరుమలలో సమస్యల తిష్ట..
దెబ్బతింటున్న ప్రతిష్ట..!!
ఓ పరమాత్మా..
నువ్వు ఏడుకొండలపై ఉన్నావేమో గాని
నిజానికి అక్కడ
పైసా మే పరమాత్మ..!