జగన్..ఇలాగైతే వారసత్వమూ గల్లంతే..!

By Admin

జగన్..ఇలాగైతే వారసత్వమూ
గల్లంతే..!

అధికారముకై పెనుగులాటలో
అన్న..చెల్లి పోటీ..!

_________

అది..2004..
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి
మంత్రివర్గ సభ్యులను..
ఎమ్మెల్యేలను
తన ఇంటికి విందుకు తీసుకువెళ్ళారు.అప్పుడు తనతో పాటు అదే కారులో ఉన్న సన్నిహితుడు ఒకాయనతో ఆయన
ఇలా అన్నారు..

ఈ కుర్చీ అందుకోడానికి నాకు పద్దెనిమిదేళ్లు పట్టిందయ్యా..

అంటే ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యాన్ని వైఎస్సార్ 1986 నుంచి నిర్దేశించుకున్నారన్న మాట..అంతకు చాలా ముందే ఆయన ఎమ్మెల్యే.. శాసనసభ్యుడైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన మంత్రిగా..
సిఎల్పీ నాయకుడిగా..
ఎంపీగా వివిధ
హోదాల్లో పని చేసినా సిఎం అవ్వాలన్న లక్ష్యం విషయంలో ఆయన ఏ దశలోనూ
తగ్గింది లేదు.

మన మధ్య లేని మనిషి గురించి ఈ మాటలు
తగవని ఎంతగా అనుకున్నా
తప్పడం లేదు.ముఖ్యమంత్రి కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు
ఆయన తొక్కని దారి లేదు.

అడిగారు..కడిగారు..
అదమాయించారు…
గదమాయించారు..
తమాయించారు..

ఫ్యాక్షన్..ఫిక్షన్..
యాక్షన్..ఓవరాక్షన్..
కల్లోలాలు…(?)త కలహాలు..
దూషణలు..ఆరోపణలు..
చాప కింద వ్యవహారాలు..
తెరచాటు రాజకీయాలు..
ఆయన కొడుకు వైనాట్
అని మొన్న అన్నట్టు
ఆయన వాట్ నాట్..
చెయ్యదగినవి..చెయ్యరానివి
చాలా చేసారు.దానాదీనా
చెప్పొచ్చిందేంటంటే
ఎన్ని చేసినా సిఎం కావడానికి ఆయనకి పద్దెనిమిదేళ్లు పడితే
ఆయన పుత్రరత్నం
ఆయన మరణించిన
ఉత్తరక్షణం నుంచే సింహాసనం
తన వారసత్వ హక్కు అన్నట్టు
శవం ఉండగానే వశం
చేసుకునే ప్రయత్నం చేసారు.
అప్పటికి ఆయనకి రాజకీయ అనుభవం నాలుగు నెలలు.
అది కూడా ఎంపీగా..
మహాసముద్రం వంటి
కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉండగా ముఖ్యమంత్రి పదవి
తమ కుటుంబ సొంత ఆస్తి అన్నట్టు ఆ కుర్చీ కోసం
సోనియా గాంధీపైనే తిరగబడ్డారు.

అప్పటివరకు జగన్ అనే వ్యక్తి చేసినట్టుగా చెబుతున్న అవినీతి పనులను ఆయన తండ్రి ఎటూ కాసుకొచ్చారు.
ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం
అధినేత్రిపైనే తిరుగుబాటు
చేశారో మొత్తం ఆయన అవినీతి చిట్టా బయటికి వచ్చింది.తదనంతర కాలంలో
ఆయనకి జైలు..
బెయిల్ మంజూరులో జాప్యం..
2014 ఎన్నికల ముందు విడుదల..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పురుడు..తల్లి కాంగ్రెస్ నుంచి మొత్తం లాగేసుకుని
తన పార్టీలోకి లాగిన్ చేసేసుకున్న వైనం..
మొదటి ప్రయత్నంలో విఫలం..
2019 లో ఘన విజయం..
దక్కిన ముఖ్యమంత్రి పీఠం..
ప్రజలు బ్రహ్మరథం పట్టినా
నిలబెట్టుకోలేకపోయిన తీరు…మొన్న 2024 లో నిండా మునిగిన వైనం…ఆ గమనం అబ్బో అదో పెద్ద కథనం..!

మొత్తానికి వైఎస్సార్
అంత పకడ్బందీగా
అన్ని ప్రణాళికలు
రచించి అమలు చేసి సాధించుకున్న సిఎం కుర్చీని
ఆయన పుత్రరత్నం వంశపారంపర్య హక్కుగానే గాక జీవిత పర్యంతం
తన వద్దనే ఉండే
కుటుంబ ఆస్తిగా
భావించి అయిదేళ్ల పాలనను ఇష్టారాజ్యంగా సాగించి చివరకు చెయ్యి కాల్చుకున్నారు.

ఇక్కడి వరకు ఒక రకమైన కథ
నడిస్తే మొన్న 2024 ఎన్నికలకు ముందు వైఎస్ కుటుంబంలో
మొదలైన వారసత్వ పోటీ ఖచ్చితంగా 2029 నాటికి ముదురు పాకాన పడడం తథ్యం.ఇన్నాళ్లు ఒక లెక్క..
ఇప్పుడాయన కూతురొచ్చింది..
అంటూ రాజశేఖర రెడ్డి వారసత్వ ట్యాగ్ తో కుమార్తె షర్మిల గల్లీలోకి దిగింది.

నిజానికి షర్మిల జగన్ కంటే వాగ్ధాటి కలిగిన వ్యక్తి..
అన్నతో పోలిస్తే ఆమె చరిత్రలో
రక్తం లేదు..భోక్తం లేదు..!
2019 లో జగన్ పార్టీ గెలుపులో షర్మిల పాత్ర కీలకం.
ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీలో ఉంది.
మొన్నటి ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బాగా పుంజుకున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల నాటికి
అటు కేంద్రంలో..
ఇటు రాష్ట్రంలో గెలిచి
రెండు చోట్ల
పూర్వవైభవం తెచ్చుకోవాలన్న
సంకల్పంతో ఉంది.ఈ క్రమంలో
కాంగ్రెస్ అధిష్టానం నుంచి షర్మిలకు అన్ని విధాలుగా పూర్తి
ప్రోత్సాహం..మద్దతు ఉంటాయి.ఒకవేళ జగన్ కాంగ్రెస్ లోకి రావాలని అనుకున్నా..తన పార్టీని
మాతృసంస్థలో విలీనం చేయాలని అనుకున్నా అందుకు షర్మిల గ్రీన్ సిగ్నల్ తప్పని సరి. మరి జగన్
ఏం చేస్తారన్నది వేచి చూడాలి.
అయితే వైఎస్ వారసత్వానికి మాత్రం ఇకపై జగన్ ఎంతమాత్రం బ్రాండ్ అంబాసిడర్ కాబోరన్నది పక్కా.

ఇక్కడే మరో విషయం..
జగన్ శాసనసభ్యత్వానికి
రాజీనామా ఇచ్చి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకుంటున్నట్టు
గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఉట్టికెక్కలేనమ్మ సామెతలా ఉంది ఈ ఆలోచన అది నిజమైతే..!..

ఢిల్లీలో చక్రం సంగతి అటుంచితే..జగన్ ఎంపీగా వెళ్తే ఇక్కడ రాష్ట్రంలో
వైఎస్ వారసత్వం ట్రేడ్ మార్క్
ఖచ్చితంగా షర్మిల ఎగరేసుకు పోతారు..అప్పుడు జగన్ పరిస్థితి ఉన్నదీ పోయింది..
చందాన అయిపొతుందేమో..
ఇంతా చేసి కడప పార్లమెంట్
బరిలో ఆయనకు చుక్కెదురైతే..అప్పుడిక
ఆయన కెరీర్ కు కళ్లెం..
ఆయన పార్టీకి గొళ్ళెం..
తప్పవు..

జర సోచో జగన్ జీ..
ఇది పబ్జీ కాదు..!

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

సురేష్ కుమార్ ఎలిశెట్టి
జర్నలిస్ట్
9948546286

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version