ఉవ్వెత్తున లేచిన చంద్ర కెరటం..వీచిన పవనం..ఊపిరాడక ఫ్యాన్ ఉక్కిరి బిక్కిరి
జగన్ ను నిండా ముంచిన స్వయంకృత నియంత పోకడలు
ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాన్ పవనాలు వీచాయి. చంద్రబాబు నాయుడు హవా పనిచేసింది. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్ డిఏ కూటమి లో ఉన్నప్పటికి రాష్ర్టంలో ఎన్ డిఏ గాలి కాని మోది ప్రభావం కాని పనిచేయలేదు. బిజెపి గాలికన్నా చంద్రబాబు నాయుడు వ్యూహం పవన్ దూకుడు రెండు పనిచేశాయి.
వైఎస్ఆర్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘోరాతి ఘోర మైన పరాజయంతో సర్కార్ ను నిలబెట్టుకోలేక పోయాడు. ఇది ఆయనకు ఆయన పార్టి నేతలకు ఊహించి ఉండని షాక్. ఆ పార్టి కోలుకోవాలంటే చాలా రోజులే పడుతుంది.
జగన్ ఘోర పరాజయం వెనకాల అనేక విషయాలు పనిచేశాయి.జగన్ నియంత పోకడలు పార్టి నేతల మూర్ఖపు అవేశాలు తిట్ల పురాణాలు ఆ పార్టీని అధ పాతాళానికి తొక్కాయి.
జగన్ మోహన్ రెడ్డి అధికార మదం నెత్తి నెక్కి చేసిన వెధవ పనులకు దక్కిన ఫలితం ఇది. వైనాట్ 175 అంటే జనం గోగో జగన్ అంటూ ఇంటికి సాగనంపారు.
ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్య విధానాలు పిచ్చి వేశాలు సాగవని ఎపీ ప్రజలు ప్రజలు తేల్చి చెప్పారు. ఎపీకి తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేలేదని జగన్ మోహన్ రెడ్డి ని నమ్మి ప్రజలు ఆయనకు పట్టం గడితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడన్న విమర్శలు వచ్చాయి.
నగదు బదిలి పథకాలతో ఓట్లు భద్రం అనుకున్న వై.ఎస్ జగన్ కు ప్రజలు తూట్లు పొడిచారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని అటు పవన్ ను ఇటు సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడును ముప్పు తిప్పల పెట్టి వేధించిన జగన్ పతనాన్ని కొని తెచ్చుకున్నాడు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ చంద్రబాబు నాయుడు పై ప్రతీకారానికి కాలు దువ్వినపుడే ఆయన పతనం ప్రారంభమైంది. ప్రజాబలం కలిగిన పార్టి నేత అని కూడ చూడకుండా న్యాయ పరంగా నిలవని కేసులో అవినీతి అంటగట్టి చంద్రబాబును జైళుకు పంపి జగన్ రాక్షసానందం పొందిన ఫలితమే ఈ పతనం.
పవన్ కళ్యాన్ ను ఆయన అనుచరులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన ఫలితమే ఈ పతనం. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా కేవలం తండ్రి వై.ఎస్ రాజేశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు అధికారం అడ్డు పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల అస్తులను చూసుకుని రోజకీయ జీవితం ప్రారభించిన జగన్ ప్రజాస్వామ్యం విలువలను గౌరవించ లేదు.జగన్ చుట్టూ ఆయన అనుచర గణం కూడ జగన్ ను మించిన అరాచక శక్తులుగా తయారై ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో నవ్వుల పాలు చేసారు.
అవినీతి, అధికార దుర్వినియోగం అహంకారం అన్ని కలగలిపి మూడు రాజధాను లంటూ జగన్ ప్రజలను గందర గోళంలో పడేసాడు. లాండ్ టైటిల్ యాక్టు అంటూ తిరకాసు మరకాసు చట్టాలను ముందుకు తెచ్చాడు. మద్య పాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ కొత్త బూమ్ బూమ్ బ్రాండ్లు తెచ్చి అడ్డుగోలుగా మద్యం ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెట్టాడు.
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. జగన్ ఉత్తాన పతనాలకు ప్రజలే కారణం. 2019 లో బంపర్ మెజార్టి ఇచ్చి బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఐదేళ్లు వేచి చూసి సమయం రావడంతో అధ పాతాళానికి తొక్కారు.
నేతలూ జాగ్రత్త…
నేతలూ జాగ్రత్త ప్రజాస్వామ్యంలో ఇష్టాను సారంగా ప్రవర్తిస్తే ప్రజలు తగిన రీతిలో ఇలాగే బుద్ది చెబుతారు. అధికారం శాశ్వతం కాదు. ప్రజాసేవకోసం ప్రజలిచ్చిన అధికార పీఠాలు ఎక్కి కన్ను మిన్ను కానరాకుండా తయారు కావద్దు. ప్రజలే అంతిమ పాలకులు… ప్రజాస్వామ్యమే శాశ్వతం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు అధికారంలో ఉన్నపుడు పోలీసులను అడ్డుపెట్టుకుని ఎవరిని పడితే వారిని బొక్కలో తోస్తే ప్రజలు ఇట్లాగే బొంద పెడతారు.
——ఎమ్మార్కె