ఇది కథ కాదు- ఓ సగటు జీవి కన్నీటి గాధ!

దిక్కు లేక.. ఒంటరితనాన్ని జయించే దారి దొరక్క.. బయటికి వెళ్ళాలన్నా తోడు ఉండక.. కడుపుకు ఇంత ముద్ద పెట్టే మనిషి కరవై..

Admin
By Admin
  • *_ఇది కథ కాదు..!_*

 

ఎప్పటిలాగే ఆరోజు ఉదయం కూడా ఆ పెద్దాయన ఇంటికి పేపర్ వెయ్యడానికి వెళ్ళాను..తీరా చూస్తే గేటుకు కట్టి ఉండే డబ్బా కనిపించలేదు..నా డ్యూటీ
పేపర్ ఇచ్చానా లేదా అంతే
కదాని అనుకుంటూ గేటులోకి విసిరేయబోయి
ఒక్క క్షణం ఆలోచించాను..
పాపం పెద్దాయన..వంగి తీసుకోవడం కష్టం అవుతుంది కదా..తలుపు కొట్టి చేతికి ఇచ్చేస్తే ఆయనకి శ్రమ తప్పుతుంది..నేను కూడా ఆయన క్షేమ సమాచారాలు అడిగినట్టు అవుతుందని లోనికి వెళ్లి తలుపు తట్టాను.అవతల గొళ్ళెం తీస్తున్న శబ్దం..హమ్మయ్య..పెద్దాయన బ్రతికే ఉన్నాడులే..అని అనుకుంటుండగా తలుపులు తెరుచుకున్నాయి.

ఆయన పేరు సుబ్బారావు..
ఓ డెబ్భై యేళ్లు ఉంటాయి.
పెన్షన్ బానే వస్తుంది..
ప్రతి నెలా ఠంచనుగా
అయిదో తేదీ నాడే పేపర్ బిల్లు కట్టేస్తారు.ఆరోజున తప్పించి ఆయన్ని చూసేదే ఉండదు.డబ్బాలో పేపర్ పడేయడం..బిల్లు కోసం నెలకోసారి వెళ్ళడం..
ఇదే మా ఇద్దరి మధ్యా
నడిచే కథ..!

తలుపు తెరిచిన సుబ్బారావు
గారు కాస్త నీరసంగా కనిపించారు. కళ్ళు లోతుకు వెళ్లిపోయాయి.

నేను ఆయన్ని అడిగాను..
సార్ పేపర్ పడేసే బాక్స్ కనిపించడం లేదేంటి సార్ అని..

నేనే తీసేసాను..పెద్దాయన సమాధానం..ఇకపై రోజూ తలుపు కొట్టి పేపర్ చేతికి
ఇచ్చి వెళ్ళు..ఆర్డర్ కాదది వేడుకోలు..

ఏమి సార్ అలా..
మీకు నాకూ ఇద్దరికీ శ్రమే కదా..అన్నానే గాని ఎందుకు అన్నానా అని పీకింది..

దానికి పెద్దాయన సమాధానం వింటే గుండె తరుక్కుపోయింది..

నాయనా..నువ్వు తలుపు తట్టే శబ్దం వినాలని ఉంది.
ఎప్పుడో కాని ఈ ఇంట్లో
ఆ శబ్దం వినిపించదు.
నువ్వు రోజూ ఉదయాన్నే తలుపు తట్టావనుకో..
వచ్చేది నువ్వే అని తెలుసు..
కానీ ఓ క్షణం..
మా అబ్బాయో.. అమ్మాయో..వాళ్ల పిల్లలోనని
చిన్న ఆలోచన..
అదే బ్రతికిస్తుంది..
ఏదో ఒక రోజైనా నిజంగా అలా జరుగుతుందేమో..

ఒక్కడినే ఉంటున్నా…
నువ్వు వచ్చి తలుపు తట్టి
నేను తీస్తే నేను బ్రతికి ఉన్నట్టు నీకే కాదు..
*నాకూ తెలుస్తుంది..*

మరో మాట..
ఇది మా అబ్బాయి నంబర్..
ఏదో ఒక రోజున
నువ్వు తలుపు తట్టేపాటికి
నేను ఉండను..ఆరోజు కూడా ఎంతో దూరంలో లేదు.నేను లేనన్న సంగతి ముందు తెలిసేది నీకే..
నువ్వు వెంటనే మా అబ్బాయికి నేను పోయానన్న సంగతి తెలియజేయి.నీకు కూడా తెలియని పరిస్థితే ఉంటే..
నా శవం కుళ్లిపోడమే..
అది నేను ఊహించలేను కూడా.. నా చావు కబురు తెలిశాక ఎటూ మావాళ్ళు వస్తారు.లేదంటే ఎవరికో బెత్తాయిస్తారు.ఏదీ ఆగదు.
కర్మకాండలు ఎలాగోలా జరుగుతాయి.పిల్లలు వస్తే
అది అదృష్టం..లేదన్నా గాని నా శవమైతే శ్మశానానికి చేరుతుంది కదా..!

ఇదీ పరిస్దితి.. అందరి ఇళ్ళలో కాకపోయినా కొన్ని కుటుంబాల్లో ఇలాగో..కాస్త అటూ ఇటుగానో జరుగుతున్నాయి.

తల్లిదండ్రులను వదిలి బిడ్డలు వెళ్లిపోవడం విదేశాల్లో జరుగుతుందని
విని విడ్డూరం అనుకునే వాళ్ళం.ఇప్పుడు మన దేశంలో కూడా సాధారణం అయిపోయింది.ఎన్నో ఇళ్ళలో ఒంటరి తల్లిదండ్రులను చూస్తున్నాం.
భార్య పోయిన భర్తలు..
మగ తోడు లేని అమ్మలు..
ఏకాకి బ్రతుకులు..

నిజమే..కొందరు తల్లిదండ్రులు పిల్లలు
తాముండే ఊరికో..దేశానికో వచ్చెయ్యమంటారు..వీళ్ళు వెళ్లరు..కారణం..ఆ ఊళ్ళో తెలిసిన మనుషులు ఉండరు.బయటికి వెళ్ళడానికి ఉండదు.
ఇక్కడిని మించి దుర్భరమైన ఒంటరితనం..అది చావు కంటే భయంకరమైన శాపం.

దీనికి పరిష్కారం ఏమిటి..
ఈ ప్రశ్నకు బదులేది..

డబ్బులు ఉంటున్నాయి.
కానీ పలకరించే మనిషి
ఉండడం లేదు..

లంకంత కొంపల్లో
లంకనాలు..

చుట్టూ లగ్జరీ వస్తువులు..
అవి మాట్లాడవు కదా..

పలకరించే మనిషి లేక
వింత జబ్బులు వస్తున్నాయి.

ఆప్యాయంగా పిలిచే
దిక్కు లేక..
ఒంటరితనాన్ని
జయించే దారి దొరక్క..
బయటికి వెళ్ళాలన్నా
తోడు ఉండక..
కడుపుకు ఇంత ముద్ద పెట్టే
మనిషి కరవై..
బ్రతుకు బరువై..
ఒకనాటికి..
ఆగిపోదా కథ..
ముగిసిపోదా వ్యధ..

పోయాక కూడా ఒంటరితనమేనేమో..
ఆ నరక బాధ..
బ్రతికి ఉన్నప్పుడు
అనుభవించిన
నరకాన్ని మించింది
కాదు కదా..
అప్పుడు మనసుకీ..
శరీరానికి కూడా
తెలిసే బాధ..
ఇప్పుడు ఆ బాధ లేదు..
ఆశలు కూలిపోయినప్పుడు
అనుభవించిన బాధ..
ఒళ్లు కాలిపోతున్నప్పుడు
ఉండదు కదా..
దేహానికే దాహాలు..
మోహాలు..వ్యామోహాలు..
చచ్చాక నో ఫీలింగ్..
*_ఒకరకంగా మరణమే_*
*_మంచి వరమేమో..!?_*

✍️✍️✍️✍️✍️✍️✍️

*_సురేష్ …9948546286_*

TAGGED:
Share This Article
Leave a comment