తెలంగాణ 2024 -25 బడ్జెట్ ఒక విశ్లేషణ
డాక్టర్ ఎమ్ హెచ్ ప్రసాద్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ రోజు సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
సాధారణంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ గత సంవత్సరం బడ్జెట్ లో వేసిన అంచనాలు మరియు సవరించిన అనగా నిజంగా వచ్చిన ఆదాయాలు గాని పెట్టిన ఖర్చులతో పోల్చి ఈ సంవత్సరం రాబోయే ఆదాయం చేయబోయే ఖర్చుల అంచనాలతో బడ్జెట్ తయారు చేస్తారు.
ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సమగ్ర గణాంకాల పట్టిక ఆధారంగా చూస్తే పోయిన సంవత్సరం చేసిన అంచనాకు మరియు వచ్చిన మొత్తం ఆదాయానికి వ్యత్యాసం 63570 కోట్లు ఉంది. అయినా 84 కోట్లు అధికంగా అంటే రెండు లక్షల 90 వేల కోట్ల ఆదాయం అంచనా వేశారు. ఇలా వేసేందుకు వారు చూపినటువంటి అదనపు ఆదాయం మూలధన ఆదాయ సేకరణ ద్వారా పూర్తి చేయవచ్చు అని చూపెట్టారు. ఈ పద్ధతిలో ఆదాయ సేకరణ సాధారణంగా ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ద్వారానే సాధ్యం. పోయినసారి 55 వేల కోట్ల పైచిలుకు వస్తే ఈసారి 69,577 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇది ఎలా సాధ్యమవుతుందో వివరణ లేదు.
ఇక పై స్థూల బడ్జెట్ వివరాలు విపుళీకరిస్తూ చేసిన ప్రసంగంలో ఇప్పటి వరకే 78010 కోట్ల రూపాయలు అప్పులు మరియు అప్పుల పై వడ్డీలు తీర్చినట్టు వ్రాశారు. ఇది ఈసారి బడ్జెట్ అంచనాలకు సుమారుగా 30% అవుతుంది. ఇవి తీసేస్తే ఇక ఖర్చులకు మిగిలేది సుమారుగా రెండు లక్షల 12 వేల కోట్లు. కానీ రెండు లక్షల 20 కోట్లు రెవెన్యూ ఖర్చుగా చూపెట్టారు. ఇది వివాదంశమైనటువంటి గణాంకం.
బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం చేసిన మొత్తం 671575 కోట్ల రూపాయలని పదేపదే గుర్తు చేశారు. అలాంటప్పుడు గత ప్రభుత్వాలు అప్పుల్ని ఎలా ఖర్చు పెట్టాయో అలాంటి ఖర్చుల ద్వారా రాష్ట్రానికి చేకూరిన అదనపు లాభాలు ఏమిటో కూడా వివరిస్తే బాగుండేది. అది నిజంగా ఒక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలో ముఖ్యంగా చర్చించవలసిన విషయం కాదు. ఒకవేళ అలా చేస్తే అప్పులే కాదు ఆ అప్పుల వినియోగం మరియు ఈ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఎంత కేటాయించి ఆ మొత్తం అప్పు తీరుస్తారో చెప్పాలి. ఆ వివరణ లేదు.
ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రసంగం ఒకచోట ఆర్థిక అభివృద్ధి దేశ సగటు కన్నా ఎక్కువ జరిగిందని. అది 7.4 శాతం అని చెబుతూ అదే విధంగా రాష్ట్ర స్థూల ఆదాయం 11.9 శాతం పెరిగింది అని అన్నారు. ఈ రెండింటి వ్యత్యాసం ఏంటో ఎక్కడ వివరించలేదు.
గత సంవత్సరం రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటు తలసరి ఆదాయం కన్నా లక్షా 64 వేలు ఎక్కువగా ఉందని కానీ ఆదాయం జిల్లాల మధ్యన ఎక్కువ వ్యత్యాసం ఉందని చెప్పారు. కానీ ఈ వ్యత్యాసాన్ని పూరించే సూచనలు మాత్రం చేయలేదు.
ఏది ఏమైనాప్పటికీ ఈ విధంగా తలసరి ఆదాయంలో సూచించినటువంటి పెరుగుదల ఈ 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది కాదు అనేది విధితమే. ఎందుకంటే ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఏమి లేకున్న సంక్షేమ కార్యక్రమాలపై పెట్టిన ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. దీనితో ఇదివరకే కుదేలైన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజార వచ్చు.
కాకుంటే సంక్షేమం కోసం మూలధన వ్యయాన్ని గత సంవత్సరాలతో పోలిస్తే బాగా తగ్గించారు. ఇది భవిష్యత్తు ఆదాయాలపై ప్రభావం చూపెడుతుంది.
అన్నిటికన్నా ముఖ్యమైన రంగం వ్యవసాయం అని ఉద్ఘాటిస్తు ఆర్థిక మంత్రి గారు రైతు కూలీలకు 12000 సహాయం, పంట బీమా పథకం, సన్న బియ్యం పండించేందుకు కావలసిన విత్తనాల కోసం, రైతుబంధ కింద పెంచిన ఖర్చులకు ఎన్నో ఇతర విధాలుగా రైతుల సంక్షేమానికి ప్రణాళికలు వేసుకున్నామని చెప్పారు కానీ, ఈ వ్యయాల అంచనాల వివరాలు లేవు.
పోయిన ప్రభుత్వం అర్హత లేని రైతులకు రైతు బీమా ఇచ్చిందని అలాంటి వారిని ఈసారి రైతుబంధు నుంచి మినహాయించామని చెప్పారు. కానీ అలా మినహాయింపబడిన రైతుల సంఖ్య ఎంత తద్వారా ఈ పద్దు కింద రెవెన్యూ వ్యయం ఎంతవరకు తగ్గుతుందనే వివరాలు లేవు.
ధరణి గురించి వివరించారు. అది బడ్జెట్ కు సంబంధించిన విషయం కాదు.
మహిళలకు బస్సు ఫ్రీ, గ్యాస్ సబ్సిడీ, గృహలక్ష్మి ప్రజా పంపిణీ, స్వయంసేవకు గ్రూప్స్ కి మొత్తం కలిసి 9,378 కోట్ల కేటాయింపులు చేసినట్టు చెప్పారు. కానీ ఈ పథకాల కింద గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిందా లేదా అని వివరాలు మాత్రం లేవు.
పంచాయతీరాజు గ్రామాభివృద్ధికి 29,816 కోట్ల రూపాయల కేటాయించారు. కానీ ఈ మొత్తం ఏ రూపంలో ఖర్చు పెడతారో వివరాలు లేవు.
జిహెచ్ఎంసి ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్స్, రోడ్లు, సత్వర వ్యవసాయ ప్రణాళికలకు, మెట్రో విస్తరణకు, పారిశుద్వానికి, హైడ్రా ప్రాజెక్టుకు, మూసి సుందరీ కరణ ప్రాజెక్టుకు కలిపి మొత్తం 3385 కోట్లు కేటాయించారు.
ప్రతిపాదించన రీజినల్ రింగ్ రోడ్డు కు మరియు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్యన వాణిజ్య మరియు పరిశ్రమల అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలకు 1525 కోట్లు కేటాయించబడినవి.
మహిళా శిశు సంక్షేమం కోసం 2736 కోట్లు కేటాయించారు. కానీ ఇందులో అంగన్వాడి ఆశ వర్కర్ల యొక్క చాలా కలంగా ఉన్నటువంటి డిమాండ్లకు అదనపు కేటాయింపుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
ఎస్సీల సంక్షేమానికి 33124 కోట్లు మరియు ఎస్టీల సంక్షేమానికి 17056 కోట్లు ప్రతిపాదించారు. ఈ మొత్తం ఎస్సీ ఎస్టీల ఎదుర్కొంటున్న టువంటి రకరకాల సమస్యలు ఒక్కొక్క దానికి ఏ విధంగా ఖర్చు పెడతారో వివరాలు లేవు. ఈ కేటాయింపులు మాత్రం సుమారుగా జనాభాలో వారి శాతానికి దగ్గరగా ఉంది.
మైనార్టీల సమస్య పరిష్కారాలకు 3003 కోట్లు కేటాయించారు
బీసీ సంక్షేపానికి 9200 కోట్లు కేటాయించారు. ఇది జనాభాలో వారి శాతం కన్నా చాలా తక్కువ.
వైద్య రంగానికి 11468 కోట్లు విద్యుత్ రంగానికి 19427 కోట్లు కేటాయించారు. కానీ మళ్ళీ ఈ పద్దులో కూడా పోయిన బడ్జెట్ కేటాయింపులపై పెరుగుదల ఎంతుందో తెలియ చేయలేదు.
అడవులు పర్యావరణ పరిరక్షణకు 1064 కోట్లు కేటాయించారు. నైపుణ్యాభివృద్ధికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆదారిత పౌర సౌకర్యాల అభివృద్ధికి, ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ వేసేందుకు ప్రతిపాదనలు చేశారు కానీ బడ్జెట్ కేటాయింపులు లేవు.
విద్యకు 21292 కోట్లు, పరిశ్రమలకు 2762 కోట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 774 కోట్లు, ఇరిగేషన్ 22301 కోట్లు, లా అండ్ ఆర్డర్ కి 9,564 కోట్లు, రూట్స్ & బిల్డింగ్స్ కి 5790 కోట్లు కేటాయించారు. పోయిన బడ్జెట్ అంచనాల వివరాలు పై హెచ్చు తగ్గుల వివరాలు లేవు.
ఈ బడ్జెట్లో పోయిన సంవత్సరం బడ్జెట్ యొక్క సవరించిన అనగా నిజంగా వచ్చిన ఆదాయాలు పెట్టిన ఖర్చులతోని పోలిస్తే 60 వేల కోట్ల తేడా కనబడుతుంది. ఈ తేడాని ఆస్తుల అమ్మకాలు ద్వారా పూడ్చుకోవచ్చని ఒక ప్రతిపాదన ఉంది. కానీ వివరాలు ఎక్కడ లేవు. పోయిన బడ్జెట్లో సవరించిన ఆదాయము లక్ష 69 వేల కోట్లకు, పోయిన సారి మూలదన సంపాదన 55 వేల కోట్లు కలిపితే వచ్చేటువంటి 224000 కోట్ల కన్నా ఈసారి ప్రతిపాదించిన మొత్తం ఖర్చులు లెక్కల్లో చూపించిన లోటు కన్నా చాలాఎక్కువగా ఉంది.
ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి గురించి ఏ వివరాలు లేవు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తద్వారా రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో సృష్టిస్తామని చేసిన భారీ ప్రమాణాల గురించి బడ్జెట్లో ఏ ప్రస్తావన లేదు. ఈ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు వాటి కేటాయించడం బడ్జెట్ ఎంత అనేది నిర్దిష్టంగా ఉంటే కానీ వారు చేసిన ప్రమాణాల ఆధారంగా ఓట్లు వేసి గెలిపించిన యువతకు వారిపై విశ్వాసం కలగదు.
కాకుంటే ఇవి అంచనాలే. ఈ ప్రభుత్వం ఈ అంచనాల్ని ఎంతవరకు సార్ధకం చేస్తుందో చూడాలి.
అసలు నిజంగా బడ్జెట్ ద్వారా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలంటే ప్రతి రంగానికి పోయినసారి కేటాయించిన వనరులు, వాటి ద్వారా ఆశించిన లక్ష్యాలు ఆ వనరులు ఎంతవరకు ఖర్చు పెట్టారు, ఆ లక్ష్యాలు ఎంతవరకు సాధ్యమయ్యాయి అనే లెక్కలు ఇవ్వాలి. బడ్జెటే కాదు, బడ్జెట్ మూల్యాంకన కూడా ప్రభుత్వాల బాధ్యత. అలా చేస్తేనే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారుగా ఉండగలరు.
డాక్టర్ ఎమ్ హెచ్ ప్రసాద్ రావు