పాటకు వన్నెలద్దిన సిరివెన్నెల!

Admin
By Admin
Sirivennela Sitarama Sastry Remembered

పాటకు వన్నెలద్దిన

సిరివెన్నెల!

________

సీతారామశాస్త్రి జయంతి

       20.05.1955

********

(ఎలిశెట్టి సురేష్ కుమార్)

          9948546286

✍️✍️✍️✍️✍️✍️✍️

నా ఉచ్వాసం కవనం..

నా నిశ్వాసం గానం..

సరసస్వర

సుర ఝరీ గమనమౌ

సామవేద సారమిది..

నే పాడిన జీవన గీతం

ఈ గీతం..

ఒకటా రెండా..

మూడువేల

మధురగీతాల

సుమధుర కలం..!

ఓయి.. సీతారామశాస్త్రి..

ఎప్పుడు వచ్చావో..

ఎన్ని పాటలు రాసావో..

సరిగమ పదనిస కరోకరో జరజల్సా..

ఒక చేత్తో విలాసం..

నమ్మకు నమ్మకు ఈ రేయిని..

కమ్ముకు వచ్చిన

ఈ హాయిని..

మరో చేత్తో విరాగం..

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..

చెలీ..ఇదేం గారడి..

నా నీడైనా అచ్చం

నీలా అనిపిస్తూ ఉంది..

అరె..అదేం అల్లరి..

ఇలా రెండు చేతుల్తో

పాటల పల్లకి మోసి

ఊరేగే చిరుగాలి..

ఈ రోజున కంటికి కనపడవేం

నిన్నెక్కడ వెతకాలి..

ఇంత తొందరగా నిన్ను పిలవాలని

విధాత తలపున ప్రభవించినది..

తన లోకంలో నీ పాట

పల్లవించాలని..!

సిరివెన్నెలా..

నీ పాట ప్రాణనాడులకు

స్పందన మొసగిన

ఆది ప్రణవనాదం..

సినీ గీతాల సాగరంలో

ప్రతిబింబించిన విశ్వరూపవిన్యాసం..

నువ్వే రాసుకున్నట్టు

విరించివై విరచించితివి

ఎన్నో కవనాలు..

విపంచివై వినిపించితివి

ఎన్నెన్నో గీతాలు..

అన్నీ మా ఎదకనుమలలో

ప్రతిధ్వనించిన

విరించి విపంచి

గేయాలు..

గుండెకు చేసిన తీపి గాయాలు!

బోడి చదువులు వేస్టు

నీ బుర్రను భోంచేస్తూ అన్నా..

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ రెచ్చగొట్టినా..

నమ్మకు నమ్మకు ఈ రేయిని..

ఇలా ప్రబోధించినా..

భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు

భర్తగ మారకు బాచిలరు..

కుర్రాళ్లను హెచ్చరించినా..

అపురూపమైనదమ్మ ఆడజన్మ

ఆ జన్మకు సరిపోలిక ఇల్లాలమ్మ..

స్త్రీమూర్తి గొప్పదనాన్ని

ప్రస్తుతించినా..

సీతారామయ్యా..

నీ పాటల్లో

లలిత ప్రియ కమలమే విరిసినది..

అవి వింటూ

తెలుగు సాహితీ

అభిమానలోకమే మురిసినది..!

నీ తోడు లేనిదే సినిమా పాట

శ్వాసకు శ్వాస ఆడదే..

నీ పాట విననిదే గుండెకు సందడుండదే!

గత కొన్నేళ్లుగా మంచి గీతం

వింటున్నామంటే

అది సీతారామశాస్త్రి పాట…

సినిమా పాటకు

సిరివెన్నెల

సోయగాలద్దిన జాబిల్లి..

సీతారామ శాస్త్రి..

మూడువేల పాటల మేస్త్రి!

కళాతపస్వి అన్వేషణ ఫలించి

అరుదెంచిన

ఈ పాటల విరించి

తొలి సినిమాలోనే

తన ప్రతిభను వివరించి..

పాటల మహసామ్రాజ్యాన్ని

ఆవిష్కరించి..

తానే అయ్యాడు

సినిమా పాటకు శృతి..లయ..!

ప్రతి పాటలో పాటవం..

పాటకు తెచ్చిపెట్టి

కొత్త గౌరవం

వినిపిస్తూ కిలకిలారావం..

సినిమా పేరునే

ఇంటిపేరుగా

మార్చుకుని

మంచి పాటకు

తానే అయ్యాడు చిరునామా..

రాసేసి వేల పాటల

వీలునామా..!

Share This Article
Leave a comment