గవర్నర్ ప్రతిభా పురస్కారములకు దరఖాస్తులు సమర్పించుటకు గడువు
తేదీని 30.11.2024 సాయంత్రం 5:00 గంటల వరకు పొడిగింపు.
***
గవర్నర్ ప్రతిభా పురస్కారములు-2024 అందచేయుట కోసం క్రింద పేర్కొన్న నాలుగు (04) విభాగాలలో గత ఐదేళ్లలో అంటే, 2019 నుండి ఆదర్శప్రాయమైన అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు మరియు ట్రస్టుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తేది. 23.11.2024 సాయంత్రం 5.00 గంటల వరకు గడువు నిర్ణయించబడినది.
అవార్డుల విభాగములు:
(i) పర్యావరణ పరిరక్షణ విభాగము
(ii) దివ్యాంగుల సంక్షేమం విభాగము
(iii) క్రీడలు మరియు ఆటల విభాగము
(iv) సాంస్కృతిక విభాగము
వివిధ వర్గాల నుండి గడువు పొడిగించుటకై వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకొని, ఇట్టి అవార్డుల కోసం ధరఖాస్తులు ధాఖలు చేయుటకు గడువు తేదీని 30.11.2024 సాయంత్రం 5.00 గంటల వరకు పొడిగించడమైనది. ఇట్టి విషయమును గమనించి అర్హులైన వ్యక్తులు, సంస్థలు తమ ధరఖాస్తులను ఇట్టి గడువు లోపున సమర్పించవచ్చును.
అవార్డుల గురించి పున:శ్చరణకై ఈ క్రింది విషయములు తిరిగి పేర్కొనబడుచున్నవి:
ప్రతి విభాగంలో రెండు కేటగిరీల అవార్డులు ఉంటాయి. ఒక కేటగిరీ వ్యక్తిగతంగా విజయం సాధించిన వ్యక్తుల కోసం మరియు రెండవ కేటగిరి అయా విభాగాలలో అభివృద్ధి కోసం కృషి చేసిన సంస్థలు/సొసైటీలు/ట్రస్ట్ ల కోసం. ప్రతి అవార్డు కింద రూ. 2,00,000/- (రెండు లక్షలు) నగదు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయబడుతుంది.
గత ఐదేళ్లుగా అంటే, 2019 సంవత్సరం నుండి పైన తెలిపిన ఏదైనా విభాగాలలో స్వయంగా రాణించిన వ్యక్తులు లేదా సంబంధిత విభాగాలలో అభివృద్ధి చెందుటకు కృషి చేసిన వ్యక్తులు వ్యక్తిగత కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చును.
అదేవిధంగా గత ఐదేళ్లుగా అంటే, 2019 సంవత్సరం నుండి పైన పేర్కొన్న విభాగాలలో అభివృద్ధికై అత్యుత్తమ అత్యంత విలువైన సహాయాన్ని అందించిన సంస్థలు/సొసైటీలు/ట్రస్ట్ లు సంస్థాగత కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
పైన పేర్కొన్న నాలుగు విభాగాలలో అత్యుత్తమ విజయాలను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తించేందుకు ఈ అవార్డులు నిర్ధేశించబడ్డాయి. గవర్నరుగారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ ద్వారా అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అవార్డుల కోసం ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ విభాగాలలో ఖ్యాతిగాంచిన విశిష్ఠ వ్యక్తులు లేదా సంస్థలను ఇతరులు కూడా ప్రతిపాదించవచ్చును.
దరఖాస్తులను ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చును.
అవార్డు గ్రహీతలకు గౌరవ తెలంగాణ గవర్నరుగారు తేది. 26 జనవరి 2025న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ప్రధానం చేసి సత్కరిస్తారు.
గత ఐదేళ్లుగా అంటే, 2019 సంవత్సరం నుండి పైన పేర్కొన్న విభాగాలలో తెలంగాణ నివాసులైన అర్హులైన వ్యక్తులు తెలంగాణ ప్రాంతంలో అయా విభాగాలలో అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు/సొసైటీ/ట్రస్ట్ లు దరఖాస్తు చేసుకోవచ్చును.
ఆఫ్‌లైన్ సమర్పణల కోసం: తెలంగాణ రాజ్‌భవన్ వెబ్సైట్ https://governor.telangana.gov.inలో అందుబాటులో ఉన్న నిర్దేశిత ఫార్మాట్ లను సక్రమంగా డౌన్లోడ్ చేసుకుని నామినేషన్ ఫారమ్‌లను పూరించి, “గవర్నరుగారి ముఖ్య కార్యదర్శి, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్ భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ – 500041” కు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సమర్పించవలెను.
ఆన్లైన్ సమర్పణల కోసం: దరఖాస్తుదారులు తెలంగాణ రాజ్ భవన్ వెబ్సైట్ https://governor.telangana.gov.inని సందర్శించడం ద్వారా నామినేషన్ ఫారమ్‌లు మరియు ఇతర అవసరమైన సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయవచ్చు.
గవర్నరుగారి ముఖ్య కార్యదర్శి