గ్రామీణ, పుర, నగర పాలక స్థానిక సంస్థలలో 42శాతం బిసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు కామారెడ్డి డిక్లరేషన్ లో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద వహించాలని రాజ్యసభ మాజి సబ్యుడు కాంగ్రేస్ పార్టి సీనియర్ నేత రాపోలు ఆనందభాస్కర్ విజ్ఞప్తి చేసారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వం తప్పుడు నిర్ణయం వల్ల బిసిలకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ గొప్పగా పోరాడిందని . న్యాయ పోరాటం కూడా చేసిందని కానీ స్థానిక సంస్థలలో బిసిలకు 2019లో అప్పటి ప్రభుత్వం 34శాతం ఇస్తామని నమ్మబలికినప్పటికి, వాస్తవానికి 18 నుంచి 22 శాతం వరకు మాత్రమే రిజర్వేషన్ దక్కిందని ఫలితంగా బిసిల సామాజిక సాధికారికత దెబ్బతిందని ఆనంద భాస్కర్ పేర్కొన్నారు.
శాసన సభ ఎన్నికలకు ముందు, మీరు ఉదాత్తంగా స్థానిక సంస్థలలో 42శాతం బిసి రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ద్వారా ఎన్నికల ప్రమాణం చేశారని దానికోసం తెలంగాణ వెనుకబడిన తరగతుల (బిసి) బహుజన ప్రజానీకం, ఆశావహులు మీ పట్ల విశ్వాసంతో ఎదురుచూస్తున్నారని ఆనంద భాస్కర్ వివరించారు.
పాలనావ్యాసంగంలో అడ్డుగా ఉండకుండా, వీలయినంత తొందరగా సర్పంచు, తదితర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ఆకాంక్షింస్తున్నట్లు తెలుస్తున్నదని మీ ఆలోచన సరైనదే కానీ, 42శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి, ఆ మేరకు స్థానాలను బిసిలకు నిర్ధారించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని, తద్వారా గత అయిదేళ్లుగా బిసిలకు జరిగిన భారీ అన్యాయం జరగకుండా చూసి, కామారెడ్డి డిక్లరేషన్ రూపంలోని మీ ఎన్నికల ప్రమాణం నిలుపుకోవాలని తెలంగాణ బిసి సమాజం పక్షాన మిమ్మల్ని వినమ్రంగా వేడుకుంటున్నానంటూ ఆనందభాస్కర్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేసారు.
బిసి నేతలకు విజ్ఞప్తి
పురపాలక, స్థానిక సంస్థలలో 42శాతం బిసి రిజర్వేషన్ కల్పనకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల ప్రమాణం సాధించుకోవడం బహుజన సోదరులందరికి కీలకమని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న అన్ని స్థాయిల్లోని ఆశావహులు, బిసి సంఘాల ద్వారా జిల్లాలలో, మండలాల్లో తమ వంతు సామాజిక బాధ్యత నెరవేరుస్తున్న వారు, వివిధ బిసి కులాల లోని ప్రొఫెషనల్ అసోసియేషన్లలో పనిచేస్తున్న జిల్లా, మండల బాధ్యులు సంఘటితంగా నినదించాల్సిన సమయ మన్నారు.
ఆదమరిస్తే, ఏమరుపాటుకు గురవుతే, మన బిసి పునాదులు దెబ్బతింటాయన్నారు.
గత అయిదేళ్లుగా బిసిలకు జరిగిన భారీ అన్యాయం జరగకుండా కామారెడ్డి డిక్లరేషన్ లోని కాంగ్రెస్ ఎన్నికల ప్రమాణం నిలుపుకోవాలని తెలంగాణ బిసి సమాజం పక్షాన అందరూ కలిసికట్టుగా కదలాలన్నారు.. అందుకోసం జిల్లాలలో, మండలాలలో ఎక్కడికక్కడ సంఘటితంగా మనమంతా ఏకమై, వెంటనే సమావేశాలు జరిపి, రాత పూర్వక అభ్యర్థనలు చేస్తూ డిమాండ్ బలోపేతం చేయాలన్నారు. కొద్దిరోజుల వ్యవధి తర్వాత శాంతియుతంగా ప్రదర్శనలు ఆరంభించాలని ఒక్క గొంతుకగా నినదిస్తూ ఐక్యంగా కదిలితే, స్థానిక సంస్థలలో 42శాతం బిసి రిజర్వేషన్ పరిరక్షించుకోగలుగుతామన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ ఈ అవకాశం రాదని మన అవసరం. మనందరి భారం, బాధ్యత. దయచేసి అన్ని స్థాయిల్లో, అన్ని చోట్ల అరమరికలు లేకుండా, ఐక్యంగా కదులుదామనికోరారు.