సమైక్య సర్ప సంచారం – తెలంగాణ సమాజం కలవరం
వేగంగా కదులుతున్న “బాబు అండ్ కో”కొల్లలు
సర్ప సంచారం … మన ఇంట్లో ఒక పాము దూరిందనుకోండి. ఎం జరుగుతుంది. దానిని బయటకు పంపే వరకు లేదా దానిని చంపే వరకు ఇంటిల్లాదులకు నిద్ర పట్టదు. పోనీ, పామే కదా… అటవీ జంతువులని నిర్లక్ష్యం చేస్తే అది మనను మన కుటుంబ సభ్యులను కరిచి మట్టుబెట్టుతుంది. సరిగ్గా ఇదే పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలో ఏర్పడింది. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో మకుటాయమానంగా భావించే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ద్వారా నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షగా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దీనితో, తమ వ్యాపార దోపిడీకి అడ్డుగా ఉన్న తెలంగాణా ప్రభుత్వంపై నిరంతరం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉన్నారు తెలంగాణ వ్యతిరేకులు. దీనిలో భాగంగానే, ఓటుకు నోటు, చేవెళ్ల ఫామ్ హౌస్ కుట్ర, ఖమ్మం జిల్లాలో నాలుగు మండలాలకు ఏకపక్షంగా ఆంధ్రాలో కలుపు కోవడం లాంటి అనేక ప్రత్యక్ష కుట్రలకు పాల్పడుతూనే వచ్చారు. అయినప్పటికీ, తెలంగాణా ప్రజల ఆకాంక్షలను కాపాడే కాపాడేందుకై ఉన్న కేసీఆర్ వీరి ఆటలను ఏమాత్రం సాగకుండా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూనే వచ్చాడు. ఇక లాభంలేదని, సోషల్ మీడియా, సమైక్య మీడియా విష నాగులను అడ్డుపెట్టుకొని గత ఏడేండ్లలో తెలంగాణా లో సాధించిన అద్భుత విజయాలను మరుగున పడేస్తూ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులపై ఒక పద్దతి ప్రకారం విషం చిమ్ముతూనే ఉన్నారు. జవాబుదారీ లేని తనంతో కొందరు జర్నలిస్టులుగా చెప్పుకునే వారు సోషల్ మీడియా ముసుగులో విపరీత దుష్ప్రచారానికి పాల్పడడం దానిని అమాయక ప్రజలు నమ్మడం, బంగారు బాతు లాంటి తెలంగాణా ఆత్మ కలిగిన ప్రభుత్వాన్ని దూరం చేసుకోవడం…. ఇవన్ని తెలంగాణ లో చోటుచేసుకున్న పరిణామాలు.
వీటన్నిటికి ఆ పెద్ద మనిషి తప్పులు కూడ ఉన్నాయి. చాలా భాద కరమైన రీతిలో అవమాన కరమైన రీతిలో తెలంగాణ సమాజం యావత్తు ఆయన చేతికిచ్చిన కత్తిని డాలును కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టి ప్రత్య్రర్థి చేతుల్లో చావుదెబ్బ తిన్నాడు. ఇదంతా ఆయన స్వయం కృతాపరాధం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అనుభవించక తప్పడం లేదు.
ఎవరిపైనైతే, సుదీర్ఘ పోరాటం జరిపి తెలంగాణను విముక్తం చేసామో, గత దశాబ్ద కాలంగా తెలంగాణలో అడుగు పెట్టాలంటే జంకిన చంద్రబాబు అండ్ కో లు కోకొల్లలుగా తిరిగి ఆ విద్రోహ స్వభావులు ఈనెల 5 వ తేదీన హైదారాబాద్ లో అడుగు పెట్టడం వారికి సమైక్య ముసుగులోని రియల్ ఎస్టేట్, భూ కబ్జా దారులు, ఇక్కడి ప్రజలను, సహజ వనరులను దోచుకొని పక్క రాష్ట్రానికి తరలించే ముఠాలు సదరు ఆఘన నాయకుడికి ఘన స్వాగతం పలికాయి. దీనికి ఇక్కడి ఆంధ్రా మీడియా పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించడం, దేశానికి ఓ గొప్ప విజనరీ, ఐటీరంగానికి ఆద్యుడు, పరిపాలనాధికారి అంటూ లేని పోనీ హైప్ క్రేయేట్ చేయడంతో ఇక్కడి అమాయక జనం ఈ తప్పుడు ప్రచారానికి లోనయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక, విభజన హామీల పరిష్కారం పేరుతో ఈ ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పటికీ, ఏ అంశంపై ఏకాభిప్రాయం రాలేదని, మరి కొన్ని సార్లు ఈ సమావేశాలు కొనసాగుతాయని ప్రకటించడం, పరోక్షంగా తెలంగాణా పై పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పెత్తనం ప్రారంభమైనట్టేనని చెప్పక తప్పదు. ఇప్పటికే, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభ మైన రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేయడానికి ఆంధ్రా పెట్టుబడి దారులు రంగంలోకి దూకారు. హైటెక్ సిటీ, కూకట్పల్లి, ఫైనాన్షియల్ సిటీ తదితర ఐటీ ప్రాంతాల్లో దాదాపు 60 శాతం భూములు ఆంధ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంద హస్తాలలో ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం అయ్యప్ప సొసైటీని అని చెప్పవచ్చు. పాలనలోనూ ఆంధ్ర అనుకూల అధికారులను నియమించుకోవడం కూడా ప్రారంభ మైంది. గత దశాబ్ద కాలంగా స్తబ్దంగా ఉన్న ఆంధ్ర గుత్తేదారులు, పవర్ బ్రోకర్లు హైదరాబాద్ లోని సచివాలయంలో ప్రతీ రోజూ దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం, తెలంగాణ మంత్రులలో కార్యాలయాల్లో దాదాపు 50 శాతం మంది ఆంధ్రా ఉద్యోగులే ఉన్నారని దీనితో తిరిగి ఏదైతే వద్దని ఉద్యమం చేసామో తిరిగి ఆ ప్రాంత ఉద్యోగులే పెత్తనం చెలాయిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఒకరు అభిప్రాయ పడ్డారు.
విభజన హామీలతో తెలంగాణా లో అడుగు పెట్టిన చంద్రబాబునాయుడి పర్యటనను స్వాగతం చేస్తూ, తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్న వామ పక్ష పార్టీల నాయకులు కూడా స్వాగతం పలకడం, ప్రధానంగా కమ్మటి నాయకులైన సీపీఐ నారాయణ, తమ్మినేని వీరభద్రం లాంటి వారు మరోసారి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తెయ్యడాన్ని కూడా తెలంగాణా సమాజం గమనిస్తోంది.
ఈమొత్తం ఎపిసోడ్ లో, బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున అధికార పార్టీలోకి వలసలు జరుగుతున్నా తెలంగాణా ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదు. గత వేసవిలోనూ,యాసంగి పంటకు నీళ్లివ్వకుండా కాళేశ్వరాన్ని ఎండబెట్టడం, 24 గంటలు కరెంటుతో ఉన్న రాష్ట్రాన్ని కరెంటు కోతలతో తిరిగి పాత రోజులను ప్రవేశపెట్టడం, రెండు లక్షల ఉద్యోగాలపై నిశ్శబ్దం పాటించడం, సామాజిక పింఛనులను పెంచకుండా కనీసం పాత పింఛనులను కూడా సకాలంలో పంపిణీ చేయని ప్రభుత్వ అసమర్థ చేష్టలను తెలంగాణా సమాజం నిశ్శబ్దంగా గమనిస్తూనేఉంది. ఈ క్రమంలో తెలంగాణా వాదం పై గెలిచిన ప్రజాప్రతినిధులు అధికార పక్షానికి వలస వెళ్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఈ పరిస్థితిలో, ఎవరిపైనా ఉవ్వెత్తున ఉద్యమం వచ్చిందో, ఎవరైతే తెలంగాణ సంపదను నిలువునా దోచుకున్నారో, ఏవైతే అక్రమంగా తెలంగాణా సచివాలయంతో సహా ఉన్నత స్థాయి ఉద్యోగాలలోదొడ్డిదారిలో వచ్చారో, తిరిగి వారందరూ చంద్రబాబు నాయుడి ముసుగులో విభజన హామీల చర్చల పేరుతొ హైదరాబాద్ లో అడుగుపెట్టడాన్ని, తెలంగాణా ప్రజల మనస్సులను తొలచివేస్తోంది.
—–తెలంగాణ వాది