*బాబూ అండ్ కో..బహుపరాక్!*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త పరుగును ప్రారంభించింది..అదే చంద్రబాబు నాయుడు..అటూ ఇటుగా అదే టీం..అదే బిజెపి..
ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తి వచ్చి చేరింది.ఆయన గురించి కింద చర్చిద్దాం..
మిగిలినదంతా 2014 నాటి బృందమే..అయితే నాటి
కథ వేరు.
నేటి 2024 కి..నాటి 2014కి మధ్యే
2019 ఉంది..అది అయిదేళ్ల కథ కాదు..1825 రోజుల సుదీర్ఘ వ్యధ..
అంతకు ముందు అయిదేళ్ల పాటు..
అంటే 2014..19 మధ్య బాలారిష్టాలను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఆ క్రమంలో కొన్ని తప్పటడుగులు..ఇంకొన్ని తప్పుటడుగులు వేసి..
ఇంక ఎన్నికలు రాబోతున్నాయి అనగా కేంద్రంలోని బిజెపి నుంచి వైదొలగి చంద్రబాబు తనకు తాను చేటు చేసుకోవడమే గాక రాష్ట్రానికి చెరపు తెచ్చారు.ఔను..2019లో ప్రభుత్వం మారింది..అధినేత మారారు..విధానాలు మారిపోయాయి..రాజధాని గల్లంతైపోయింది. అప్పులు పెరిగిపోయాయి..ప్రభుత్వ ఆస్తులు తాకట్టులోకి వెళ్లిపోయాయి.
ప్రభుత్వమే దివాళా తీసేసింది.
జీతాలు సరిగ్గా పడలేదు.రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు పడలేదు.
అభివృద్ధి కుంటపడింది.అక్రమాలు పెరిగిపోయాయి..ఆక్రమణలు పరాకాష్టకు చేరిపోయాయి. ఇంకా..ఇంకా..చాలా ఉన్నాయి.
అవి పక్కన బెట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏమిటో పరిశీలిద్దాం..!
జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయని చంద్రబాబు ఇంతకు ముందే చెప్పారు. అంతే కాదు ఇంకాస్త భారీ స్థాయిలో..
ఇక్కడొక మాట..సంక్షేమం అంటే పంచి పెట్టడమే అనే భ్రమలో జగన్ మొత్తం ఖజానా ఊడ్చేసారు.
పోనీ అదే సంక్షేమం అనుకున్నా దాంతో పాటు అభివృద్ధి జరగాల్సిన
అవసరాన్ని జగన్ గుర్తించలేదు.
2024 ఎన్నికలలో ఆ పంపిణీలే తనని గెలిపిస్తాయని జగన్ గుడ్డిగా అనుకున్నారు.కానీ అలా జరగలేదు.ప్రజలు పూర్తిగా పంపిణీపై ఆధార పడిలేరు.
జీవన వ్యయం పెరిగిపోయింది.
ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు లేవు.. ప్రాజెక్టులు ముందుకు కదలలేదు..పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి.
ఇప్పుడు చంద్రబాబు జోడు గుర్రాల మీద సవారీ చేయాల్సిందే.తాను వాగ్దానం చేసిన మేరకు పంపిణీలు కొనసాగిస్తూ అభివృద్ధి రథాన్ని ముందుకు ఉరికించాల్సి ఉంటుంది.
అమరావతి రాజధానితో పాటు
ఎన్నో ఆశలు పెట్టుకున్న విశాఖను కూడా అదే స్థాయిలో అభివృధ్ధి చేయవలసి ఉంటుంది.అప్పుడే ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల విశ్వాసాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉంటుంది.లేదంటే..
2029లో మళ్లీ కథ రివర్స్ అవుతుంది.
అలాగే తాకట్టులో ఉన్న ప్రభుత్వ ఆస్తులను విడిపించి తమ ప్రభుత్వం ఈ తాకట్టు విధానాలకు వ్యతిరేకమని బలంగా చెప్పగలగాలి.
తిరుపతి.. తిరుమలతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలు కూడా జగన్ సర్కారులో తీవ్ర నిరాదరణకు గురి కావడమే కాకుండా ప్రజలు ఆ క్షేత్రాలకు పూర్వవైభవం తేవాలి.
చంద్రబాబు పరిపాలనా దక్షుడు.
విదేశీ పెట్టుబడులు రాబట్టగల సమర్థత ఉన్నవాడు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగల అనుభవజ్ఞుడు..ఆపై సభలో అనూహ్య బలం.. ఇంకా కేంద్రం మద్దతు..ఎన్నో ప్లస్ పాయింట్లు..
ఇక బాబుదే బాధ్యత..
సాకులు వెతికే..చెప్పే పరిస్థితి కాదు.
ప్రజలకు అన్నీ తెలుసు..అన్నీ గమనిస్తూనే ఉంటారు.ఇది పక్కా..!