దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం…
* రుణమాఫీతో 16 ఏళ్ల రాజకీయ జీవితంలో మరుపురాని రోజు
* రుణమాఫీకి పాసు బుక్‌నే కొలబద్ద…
* పదేళ్లు అధికారంలో ఉండి రూ.21 వేల కోట్లు మాఫీ చేయలేకపోయారు..
* సోనియా, రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం…
* నెలాఖరున వరంగల్‌లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* రైతులకు రుణమాఫీ చెక్కుల అందజేత
* వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* రుణమాఫీతో 16 ఏళ్ల రాజకీయ జీవితంలో మరుపురాని రోజు
* రుణమాఫీకి పాసు బుక్‌నే కొలబద్ద…
* పదేళ్లు అధికారంలో ఉండి రూ.21 వేల కోట్లు మాఫీ చేయలేకపోయారు..
* సోనియా, రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం…
* నెలాఖరున వరంగల్‌లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* రైతులకు రుణమాఫీ చెక్కుల అందజేత
* వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఇప్పటి వరకు ఆ మోడల్, ఈ మోడల్ అని పలువురు చెప్పుకున్నారు…. రూ.2 లక్షల రైతు రుణమాఫీతో ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, నమూనాగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జడ్పీటీసీ సభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పార్లమెంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పని చేశానని తెలిపారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ రోజు మరుపురాని రోజని ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురయ్యారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమాన్ని రాష్ట్ర సచివాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 577 రైతు వేదికల్లోని అన్నదాతలు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయా రైతు వేదికల వద్దనున్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ 2002, మే 6వ తేదీన వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డ్లికరేషన్ ప్రకటించారని, నాడే రూ.2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చామని గుర్తు చేశారు. 2023, సెప్టెంబరు 17వ తేదీన కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఆరు గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నేతల హామీ ప్రకారం.. మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీతో మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి అన్నారు. అరవై సంవత్సరాల ప్రజల ఆకాంక్షను గుర్తించి 2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, ఎక్కువ ఎంపీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్రంగా నష్టపోతామని తెలిసినా ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. రైతుల అనుమతితో తాను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. ఏ వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రుణమాఫీ హామీ ఇచ్చామో అక్కడే కృతజ్ఞత సభ పెడతామని, ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించి రాష్ట్ర రైతుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
* పదేళ్లలో రూ.21 వేల కోట్లను మించలే…
* పదేళ్లలో రూ.21 వేల కోట్లను మించలే…
మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రుణమాఫీ విషయంలో రెండు సార్లు మాట తప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.లక్ష రుణమాఫీతో తొలిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని, అయిదేళ్లలో దఫాదఫాలుగా కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని మండిపడ్డారు. రూ.లక్ష రుణమాఫీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రూ.12 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి దఫాదఫాలుగా కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చేశారని, మొత్తంగా పదేళ్లలో రూ.21 వేల కోట్లకు మించి రుణమాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఒకే సారి రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు మిగిలిపోయి రైతుల అప్పులు తీరలేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చలేదని విమర్శించారు. తాము ఒకేదఫా రూ.2 లక్షల మేర రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. తొలి విడతగా 0 నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలకు రూ.6,098 కోట్లను విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండో విడతగా 0 నుంచి రూ.1.50 లక్షల వరకు ఉన్న రైతులకు, మూడో విడతగా 0 నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు నెల పూర్తికాక ముందే రూ.31 వేల కోట్లను రైతు రుణ ఖాతాల్లో వేసి రుణ విముక్తులను చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం డిసెంబరు ఏడో తేదీనే ప్రమాణ స్వీకారంచేసినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన డిసెంబరు 9వ తేదీని పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. డిసెంబరు 9న మరో పండుగ ఉందని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబరు 9వ తేదీనేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందుకే 2018 డిసెంబరు 12 నుంచి 2023, డిసెంబరు 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
* అపోహలు సృష్టించేందుకు యత్నాలు…
రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహను కొందరు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమేనన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని, రుణమాఫీకి పాస్ బుక్‌నే కొలబద్ద అని ముఖ్యమంత్రి తెలిపారు.భూమి ఉండి, ఆ భూమికి పాసు బుక్ ఉండి, పాసు బుక్‌పై రుణం తీసుకుంటే దానిని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ విషయంలో కొందరు దొంగలు చేసే దొంగ మాటలను నమ్మొద్దని, దీనిపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులు, రైతు వేదికల్లోని రైతులను కోరారు. రుణమాఫీకి సంబంధించి విద్యలేని, సాంకేతిక నైపుణ్యం లేని రైతులెవరికైనా సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేయాలని తాము బ్యాంకు అధికారులను కోరామని, అందుకు వారు అంగీకరించారని, అలా అంగీకరించినందుకు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.
* వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా రైతు…
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా మంచి రైతు అని, ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తారని, ఏ సమయం వచ్చినా, సందర్భం వచ్చినా రైతు సమస్యలపైనే మాట్లాడుతుంటారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి రైతు సమస్యలను తెలుసుకున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఏడాదికి రూ.6,500 కోట్ల వడ్డీలు కట్టాల్సి ఉంటే, గత ప్రభుత్వం చేసిన రూ.ఏడు లక్షల కోట్ల అప్పులతో ఇప్పుడు నెలకు రూ.7 వేల కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం జీతాలు సరిగా ఇవ్వలేకపోయిందని, ఆర్థిక ఇబ్బందులున్నా ఎనిమిది నెలల కాలంలోనే రూ.29 వేల కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రుణమాఫీ చేయలేమంటూ మాకు సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయమని తాము అడగమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని సవాళ్లు విసిరిన వారు గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
* కృతజ్ఞత తీర్మానం…
రైతు రుణమాఫీ హామీ ఇచ్చి నిలుపుకున్నందున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లకు ధన్యవాదాలు తెలుపుదామా అని ముఖ్యమంత్రి రైతు వేదికల్లో ఉన్న రైతులను అడిగారు. అందుకు సమ్మతిస్తూ అంతా చప్పట్లతో ఆమోదం తెలపడంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు కృతజ్ఞత తీర్మానాన్ని ఆమోదించారు. త్వరలోనే మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని వరంగల్ కృతజ్ఞత సభకు ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
* పది మంది రైతులకు రుణమాఫీ చెక్కుల అందజేత…
రూ.లక్ష రుణమాఫీ అయిన పది మంది రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన మలిపెద్ది చెన్నమ్మ (తొమ్మిదిరేకుల గ్రామం), జర్పుల శంకర్ (చౌలపల్లి), కందుకూరు మండలానికి చెందిన చింతకింది భిక్షపతి (లేమూరు), బండి జగదాంబ (గూడూరు), ఎర్రా అండాలు (ముచ్చెర్ల), క్యాతరమోని మల్లయ్య (పెద్ద ఎల్కచర్ల-జిల్లేడ్ చౌదరిగూడ మండలం), గొడుగు చెన్నయ్య (అగిర్యాల-కొందుర్గ్ మండలం), మారమోని యాదమ్మ (తుమ్మలూరు-మహేశ్వరం మండలం), అరకోటం శారద (ముక్తమదారం-కడ్తాల్ మండలం), విట్యాల అండాలు (కృష్ణ నగర్-ఫరూఖ్ నగర్ మండలం), మల్లిగారి మాణిక్య రెడ్డి (గోపులారం-శంకర్పల్లి మండలం) రుణమాఫీ చెక్కులు అందుకున్నారు.
* ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన రైతులు….
రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం నుంచి కుతుంబాక సీతారాం, నాగర్ కర్నూల్ జిల్లా రామాపురం నుంచి రాములమ్మ, నల్గొండ జిల్లా నుంచి తిప్పర్తి రాజు, సంగారెడ్డి నుంచి కర్రోళ్ల శివయ్య, నారాయణపేట జిల్లా ధన్వాడ నుంచి కురువ లక్ష్మి, నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి రవి, ఆదిలాబాద్ జిల్లా తాంసీ నుంచి గుర్రి మహేందర్ తదితరులు సీఎంతో మాట్లాడారు.రుణమాఫీ చేసినందుకు సంతోషం వ్యక్తం చేసిన రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.