చాగంటి గుడిగంట- ప్రవచనకర్త పుట్టినరోజు

Admin
By Admin
about chaganti koteshwar rao on his birth day by elisetti suresh kumar

చాగంటి గుడిగంట
_________

ప్రవచనకర్త పుట్టినరోజు

********

(ఎలిశెట్టి సురేష్ కుమార్)
9948546286

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

చాగంటిపై కవితా..
ప్రవచనానికి నిర్వచనమైన
శారదా పుత్రునిపై
వచన కవనమా..
వచనానికే బహువచనమైన
ప్రవచనచక్రవర్తిపై
నాలుగు మాటలు రాయాలని ఆర్తి..
మాటకే స్ఫూర్తి…
ఎల్లలేని కీర్తి..
ఎనలేని సమయస్ఫూర్తి
ఆ పరిపూర్ణ మానవతామూర్తి..
ఎంత రాస్తే..ఏమని వర్ణిస్తే
తృప్తి..నా దీప్తి..
చంద్రునికో నూలుపోగు..
పుంభావ సరస్వతికి
అక్షరాల హారతి..
ఈ రీతి..నా నిరతి!

చాగంటి గళం
పోతన పద్యాల గంగాళమా..
ఆ రసన
వాల్మీకి తన రామాయణాన్ని
లిఖించిన తాళపత్రమా..
శ్లోకం ఆయన నోట
పంచదార పాకం..
పద్యం దేవదేవునికే నైవేద్యం!

చాగంటి మాటలు
చద్ది మూటలు..
ధారణ అసాధారణమై..
అజ్ఞానాంధకారంలో
మసలే నిను నడిపించే వెలుగుకిరణమై..
ఆధ్యాత్మిక తోరణమై..
ముక్తి వైపు నీ చేయి పట్టి
నడిపే ఆపన్నహస్తమై..
నీ విజ్ఞాన సమస్తమై..!

ఇలాంటి ఓ మనిషిని
ప్రజ్ఞాన సర్వస్వమనాలో..
ఆధ్యాత్మిక భాండాగారమని
పిలవాలో..
పురుషరూపం దాల్చిన
వాగ్దేవి అని కొలవాలో..
కారణజన్ముడని స్తుతించాలో..
దేవుడే అని ప్రస్తుతించాలో..!

ప్రవచనం ఆయనకు దైనందినం..
ఎన్నిసార్లు చేసినా ఆనందమే
దినం దినం..
ఆయన అసీనమైన వేదిక
భక్తి సుమాల నందనం..
ఆ సన్నిధానమే
సకల క్షేత్ర సందర్శనం..
అక్కడ దేవతలే సంచరిస్తున్న
అనుభూతి దైవత్వ ఉనికికే
ప్రత్యక్ష నిదర్శనం..!

చాగంటి ప్రవచన శ్రవణం
దివ్యలోక విహారం..
పక్కనే వాగ్దేవి ఉన్నట్టు..
అచ్చోట శ్రీరాముడే సీతాసమేతుడై
కొలువుదీరినట్టు..
సభాస్థలిని అంజనాపుత్రుడే
పర్యవేక్షిస్తున్నట్టు..
ముక్కంటి ఆ వాగ్ధాటిని
గని..విని..
శిరసుపై ఉన్న గంగతో
నీ వేగాన్ని మించిన
ఆ వాక్ప్రవాహాన్ని చూసావా..
అని మేలమాడినట్టు..
వేణుగోపాలుడు
ఇతడు సాందీపుడా అని
దీపం వెలుగులో మరింత నిశితంగా చూసినట్టు..
వ్యాసుడు తనను తానే
చూసుకుంటున్నట్టు..
ముక్కోటి దేవతలే
మారువేషాల్లో బెరుకుగా
ఇరుకున వరసల్లో
కూర్చున్నట్టు..
సభ దేవసభే అన్నట్టు..
కలియుగమే భక్తిరసరమ్యయోగమైనట్టు..!

చాగంటి పలుకు..
వేదానికి అనువాదం..
ఆధ్యాత్మిక నినాదం..
కలియుగంలో భక్తినాదం..
వాగ్దేవికి ముదం..
సకల దేవతలకు ఆమోదం..!

ధర్మ స్థాపనకు దేవుని అవతారం..
ధర్మరక్షణకు రుషి..
ధర్మబోధనకు గురువు..
ధర్మవ్యాప్తికి ప్రయోక్త..
ఈ అందరి సమ్మేళనమే
చాగంటి అనే వక్త..
పంచె..లాల్చీ కట్టి..
నుదుటిన విభూతి పెట్టి…
ధోవతి ధరించి..
వేదికను అలంకరించే..
ధర్మ ప్రచార ప్రవక్త..!

కృష్ణం వందే జగద్గురుం..
చాగంటి యందే
మన సద్గురం..
కోటేశ్వరా..కోటి దండాలు..!

🙏🙏🙏🙏🙏🙏🙏

Share This Article
Leave a comment